: శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టండి... ఆమోదిస్తాం: సుష్మా స్వరాజ్
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్లో జరుగుతున్న తెలంగాణ ప్రజా గర్జన సభలో ఆమె మాట్లాడుతూ, బిల్లు పెడితే బీజేపీ తప్పకుండా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. 'హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ' బిల్లును తాము పూర్తి మద్దతుతో ఆమోదిస్తామని అన్నారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను తాము ఏర్పాటు చేశామని అన్నారు. తాము నిర్ణయం తీసుకున్న తరువాత మడమతిప్పలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలే ధిక్కరిస్తున్నారు.. ఎందుకలా జరుగుతోంది? అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై మరోసారి మోసం చేయవద్దని కాంగ్రెస్ పార్టీకి సుష్మా హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో శాంతి ఏర్పడుతుందని ఆమె తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీమాంధ్రులను వెళ్లగొడతామని చెప్పడం సరికాదని అన్నారు. విజయం సాధించడం లక్ష్యం కానీ, అవతలి వారిని వేధించడం లక్ష్యం కాదని అన్నారు. తెలంగాణ వస్తున్నప్పుడు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముందని తెలంగాణ వారిని ప్రశ్నించారు.