: ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయాలో అన్నీ చేస్తున్నారు: బాబు


లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైల్లో సకల మర్యాదలు చేసింది మీరు కాదా? అని కాంగ్రెస్ అధిష్ఠానంపై చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాదులోని ఆయన నివాసం నుంచి మాట్లాడుతూ.. ఎవరో హీరో బయటకు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ సకల మర్యాదలు చేస్తే.. ఏదో ఘనకార్యం చేసినవాడు బయటకు వచ్చినట్టు రాష్ట్ర, జాతీయ మీడియా ప్రాధాన్యం ఇస్తే.. నేరగాళ్లకు భరోసా ఇచ్చినట్టు కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతూ ఉందని బాబు మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలు అధికారం నుంచి ఎప్పుడు దిగుతారా.. అని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తన బాధ్యత మర్చిపోయి వ్యవహరిస్తున్నారని అన్నారు. రెండు ప్రాంతాల నాయకులను తీసుకువెళ్లి సమస్య సానుకూలంగా పరిష్కరించాలని రాష్ట్రపతిని, అన్ని పార్టీల నేతలను కలిశానని తెలిపారు. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం పని చేయలేదని, ఎవరి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడలేదని ఆయన స్పష్టం చేశారు.

రోడ్ మ్యాప్ అంటూ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి సోనియా ముందుకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెబుతున్నారని.. కానీ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ములాఖత్ అయిన విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని ఆయన గతాన్ని గుర్తుచేశారు.

సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి ఎన్ని రాజకీయాలు చేయాలో అన్నీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మూడు పార్టీలకు సోనియా స్క్రిప్టు తయారు చేస్తారని, వీళ్లు దాన్ని అమలు చేస్తారని ఆయన మండిపడ్డారు. 'రాజీనామాలు అంటారు, మరోటి అంటారు, అడుగడుగునా కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రాన్ని ముంచుతున్నారు' అని దుయ్యబట్టారు.

అధికారం కోసం, ప్యాకేజీల కోసం, వాటాలకోసం నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పదవులు తనకు కొత్త కాదని పదవుల కోసం తాను పాకులాడట్లేదని చెప్పుకొచ్చారు. విభజన అంశంపై ఇరు ప్రాంతాల జేఏసీలను పిలిచి మాట్లాడాలని సూచించామన్నారు.

  • Loading...

More Telugu News