: మళ్లీ తెగబడిన పాక్ దళాలు.. తిప్పికొట్టిన భారత్
దుష్ట పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. భారత్, పాక్ నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్ళీ నిర్లజ్జగా ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని రాజౌలి జిల్లాలో బీమార్ గలీ సెక్టార్ వద్ద పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాక్ ఈ చర్యకు పాల్పడినట్టు రక్షణ వర్గాల ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్.ఆచార్య వెల్లడించారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ కాల్పులు కొనసాగినట్టు ఆయన తెలిపారు. అయితే, మన బలగాలు పాక్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. దీంతోపాటు, ఫూంచ్ సెక్టార్లో కూడా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పాక్ దళాలు కాల్పులు జరిపాయని... ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఆచార్య తెలిపారు. ఈ నెలలో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 30వ సారి.