: ధోనీ.. ఫుట్ బాల్.. గోల్!
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ తర్వాత అత్యంత ఇష్టమైన క్రీడలు ఫుట్ బాల్, మోటార్ రేసింగ్. క్రికెట్ నుంచి ఎప్పుడు విరామం దొరికినా సాకర్ మ్యాచ్ లు చూడడమో, బైక్ వేసుకుని రివ్వున దూసుకెళ్ళడమో చేస్తుంటాడు. తాజాగా చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత సొంత ఊరు రాంచీ వెళ్ళిపోయాడీ జార్ఖండ్ డైనమైట్. తన మిత్రుడు, జార్ఖండ్ మాజీ డిప్యూటీ సీఎం సుదేశ్ మహతోతో కలిసి ఓ సాకర్ మ్యాచ్ ఆడాడు. రాంచీ సాకర్ అకాడమీతో జరిగిన ఆ మ్యాచ్ లో ధోనీ ఓ గోల్ సాధించడం విశేషం. ఆ స్నేహపూర్వక మ్యాచ్ లో ధోనీ, మహతోల జట్టు 4-1తో అకాడమీ జట్టుపై జయభేరి మోగించింది. ధోనీ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడనేసరికి స్టేడియం కిక్కిరిసిపోయిందని నిర్వాహకులు తెలిపారు.
కాగా, మ్యాచ్ అనంతరం మహతో మాట్లాడుతూ, ధోనీ త్వరలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాలని కోరుకుంటున్నామని తెలిపాడు. దీనికి ధోనీ బదులిస్తూ, దానికి కొంచెం సమయం పడుతుందని అన్నాడు. ఈ మ్యాచ్ కు మహతో నియోజకవర్గం అయిన సిలి వేదికగా నిలిచింది.