: ఉద్యోగులు సమ్మెను విరమించాలి: ముఖ్యమంత్రి
ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ ఎంప్లాయిస్ 6 లక్షల 50 వేల మంది సమ్మెలో ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు చేస్తున్న ఉద్యమం అందరి దృష్టిని ఆకర్షించిందని అన్నారు. చాలా కాలంగా ఆఫీసులు, స్కూళ్లు మూతబడ్డాయని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చాలామంది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, కోరడం జరుగుతోందని స్పష్టం చేశారు. మొత్తం 1300 కోట్ల రూపాయలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం మూడు వందల కోట్లు మాత్రమే జీతాలు తీసుకున్నారని ఆయన తెలిపారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు వెయ్యి కోట్ల రూపాయల మేర జీతాలు చెల్లించలేదని అన్నారు. జీతాలపైనే ఆధారపడే ఉద్యోగుల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఏపీఎన్జీవోలు ఉద్యమాన్ని ఆపి, విధుల్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమ్మెవల్ల విద్యార్థులు భవిష్యత్తు నష్టపోతున్నారన్నారు. ప్రతి జిల్లాలోని కలెక్టర్లు అక్కడి ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.