: రాజీనామా చేయకుండా విభజనను ఎలా అడ్డుకుంటారు: అశోక్ బాబు
రాష్ట్ర విభజన ఆగిపోతుందంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు సూటిగా నిలదీశారు. రాజీనామాలు చేయకుండా రాష్ట్ర విభజనను ఎలా అడ్డుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ఉద్యమాలు చేస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉండదని, తప్పకుండా రాజీనామాలు చేయాలన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకపోతే ప్రజలు క్షమించరని, నమ్మకం కలిగించిన తర్వాతే నాయకులు ప్రజల్లోకి రావాలని కడపలో జరుగుతున్న 'రాయచోటి రణభేరి' సభలో సూచించారు.
రాష్ట్రం విడిపోవటం రాజకీయ స్వార్ధమే అవుతుందన్న అశోక్ బాబు, ఒక భాష మాట్లాడేవారు కలిసుంటారనడానికి రాష్ట్రమే నిదర్శనమని చెప్పారు. సీమాంధ్రలో ఎక్కడా హింస జరగకుండా ఉద్యమం జరుగుతోందన్నారు. విభజనకు నిరసనగా ఏడు లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారన్నారు. కడప ప్రజలు ఇచ్చే తీర్పే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిస్తుందని పేర్కొన్నారు.