: జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి... 12 మంది మృతి


జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రోజు ఉదయం సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు 12 మందిని బలిగొన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కథువా జిల్లాలో జరిగింది. భారీగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న ముగ్గురు లేదా నలుగులు తీవ్రవాదులు ముందుగా జిల్లాలోని హీరానగర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే బయట ఉన్న వాహనంలో కథువా జిల్లాకు ఆనుకొని ఉన్న సాంబా జిల్లాలోకి పారిపోయారు. అక్కడ ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరుగురు సైనికులు మృతి చెందారు. తీవ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్న ఆర్మీ క్యాంప్ కు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. వీరంతా కలసి ముష్కరులను మట్టుబెట్టే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. దాడులకు పాల్పడిన తీవ్రవాదులు మానవబాంబులుగా భావిస్తున్నారు. తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉండటంతో, క్యాంపు గేట్ దగ్గర వీరిని ఆపలేదని తెలుస్తోంది. గేటు దగ్గరనుంచి నేరుగా మెస్ లోకి వెళ్లిన తీవ్రవాదులు అక్కడ ఉన్న 6 మంది జవాన్లను బలిగొన్నారు. ప్రస్తుతం ఈ మానవబాంబులు ఆ భోజనశాలలోనే దాక్కుని కాల్పులకు తెగబడుతున్నారు. ఇరువైపుల నుంచి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News