: అంతుపట్టని వ్యాధి కారణంగా మూతపడిన ఢిల్లీలోని స్కూలు
ఢిల్లీలోని సర్ధార్ పటేల్ పాఠశాలకు వచ్చేనెల 16 వరకు సెలవులు ప్రకటించారు. దీనికి కారణం, అక్కడ చదువుతున్న పిల్లలు అంతుపట్టని వ్యాధితో భాధపడుతుండటమే. ఎప్పుడూ లేని విధంగా ఇక్కడి విద్యార్థులు ముఖం, చేతులు, కాళ్లు, నోటికి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ జబ్బుకి ఇప్పటివరకు ఎలాంటి మందు లేదని డాక్టర్లు ప్రకటించడం.
ఈ జబ్బు బారిన పడిన చిన్నారుల ముఖం, చేతులు, కాళ్లకు... తెలుపు, ఎరుపు రంగులో ఉన్న కురుపులు వస్తున్నాయి. దీంతో పాటు గొంతుకు ఇన్ఫెక్షన్ వస్తోంది. వీటన్నిటికి తోడు తీవ్రమైన జ్వరం వస్తోంది. ఆకలి మందగిస్తుంది. ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులు ఈ జబ్బు బారిన పడ్డారని డాక్లర్లు నిర్ధారించారు. ఈ వ్యాధి 3 నుంచి 8 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు వస్తోంది. అంతే కాకుండా ఇది అంటువ్యాధి కూడా. వర్షాకాలంలో ఒక రకమైన వైరస్ వల్ల ఇది వస్తుందని డాక్టర్లు తెలిపారు.