: నాలుక కోసినా ఉద్యమం చేస్తా: అశోక్ బాబు
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు.. హిందూపురం సభలో తన వ్యాఖ్యల పట్ల వచ్చిన స్పందనలపై మాట్లాడారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు, కొందరు తెలంగాణ వాదులు వక్రీకరించారని పేర్కొన్నారు. తాము ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదని, దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. తన నాలుక కోస్తామని, ఏపీఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని కొందరు హెచ్చరికలు జారీ చేశారని.. ఆ హెచ్చరికలు సమస్యకు పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు.
నాలుక కోసినా, చేతులు, కాళ్ళు తెగనరికినా.. ఉద్యమం ఆపేదిలేదని ఉద్ఘాటించారు. ఎవరెన్ని రకాలు ఇబ్బందులు పెట్టినా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. కాగా, ఈ నెల 27, 28 తేదీల్లో సీమాంధ్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, 29న కర్నూలులో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ, 30న తదుపరి కార్యాచరణ నిర్ణయించే సమావేశం ఉంటుందని అశోక్ బాబు చెప్పారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేటు పాఠశాలలను సైతం మూసివేయాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ఎమ్మెల్యేలు విభజనకు వ్యతిరేకంగా ఓటేయాలని కోరారు.