: చంద్రబాబుకు మోడీ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'?


టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ 'ఫ్రెండ్ రిక్వెస్ట్' పంపారు. స్నేహ విన్నపమే గానీ, అయితే, అది ఫేస్ బుక్ లో పంపే 'ఫ్రెండ్ రిక్వెస్ట్' కాదండోయ్. రాజకీయ కోణంలోనే ఆయనకు బీజేపీ స్నేహ హస్తం చాచింది. కాకపోతే ఇంకా బాబు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి మోడీ స్నేహ విన్నపానికి బాబు ఓకే చెబుతారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు. కానీ, ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో బాబు ఈ రిక్వెస్ట్ ను అంగీకరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాబు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో వచ్చేనెల 2న గాంధీ జయంతినాడు నిర్వహించే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి బాబునూ ఆహ్వానిస్తున్నారట. అంటే వీరిద్దరూ వేదికను పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బాబుతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు గుజరాత్ సీఎం రిక్వెస్ట్ పంపినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఈ నెల 21న ఢిల్లీకి వచ్చిన బాబు పలువురు పార్టీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీడీపీ.. బీజేపీతో రాష్ట్రంలో పొత్తు పెట్టుకోబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంటే మోడీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బాబు ఒప్పుకోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు.

  • Loading...

More Telugu News