: సాగరంలోను ఉంటాయట...!
అంతరిక్షంలో కృష్ణబిలాలు ఉంటాయని... అవి తమ ఆకర్షణ శక్తితో చుట్టుపక్కల ఉన్నవాటిని తమలోకి లాగేసుకుంటాయని మనం చాలాచోట్ల చదివేవుంటాం. అయితే భూమిపైన ఉన్న సముద్రాల్లో కృష్ణ బిలాలుంటే... ఊహించుకోవడానికే భయంగా ఉందికదూ... అయినా కూడా సాగరాల్లో కూడా కృష్ణ బిలాలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి కూడా అంతరిక్షంలోని కృష్ణబిలాల లాగానే తమ సమీప వస్తువులను తమలోకి లాక్కుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సముద్రాల్లో భారీ ఎత్తున వలయాలు కనిపిస్తుంటాయి. ఈ వలయాలపై మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఉపగ్రహాల నుండి లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వీటిపై గణితశాస్త్ర పరంగా లెక్కలు వేసినప్పుడు రోదసిలో ఉండే కృష్ణబిలాలకు సమానమైన లక్షణాలు సముద్రంలోని వలయాల్లో కనిపించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణబిలాలు అనేవి కేవలం అంతరిక్షంలోనే కాదని, సముద్రంలో కూడా ఉంటాయని, అవికూడా తమ సమీపంలో ఉన్న వేటినైనా చివరికి నీటి బిందువునైనా కూడా తమలోకి లాగేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. రోదసిలో ఉండే కృష్ణబిలాలు ఒక పరిధి వరకూ కూడా కాంతితో సహా ప్రతిదాన్ని తమలోకి శోషించుకుంటాయి. ఈ పరిధికి బయటవుండే కాంతి అక్కడి వరకూ వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది. అలాగే సముద్ర వలయాల్లో కూడా వాటి పరిధిలోపల ఉన్న నీరు, నీటిమొక్కలు, సూక్ష్మజీవులు, జలచరాలు మొదలైనవన్నీ కూడా ఆ పరిధి దాటి బయటికి రావడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే దాని పరిధి బయట ఉండే నీటి అణువులు కూడా ఈ వలయంలోనికి వెళ్లడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధనలు సాగించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.