: ఆమ్లెట్లో ఉల్లిపాయలు లేవని... కాల్చిపారేశాడు
ఉత్తరప్రదేశ్ అంటేనే భయం కలుగుతోంది. దేశంలో ఎక్కడా చోటు చేసుకోనటువంటి అరాచకాలకు ఉత్తరప్రదేశే కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి. దీంతో ఉల్లి లేకుండానే వంటిల్లు నెట్టుకొస్తున్నాడు సగటు జీవి. బజార్లో పానీపూరి, నూడుల్స్ వంటి వాటిల్లో మచ్చుకు కూడా ఉల్లి లేకుండా పోయింది. దీంతో ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదని ఓ చిరు వ్యాపారిని కాల్చిపడేశాడో కస్టమర్ కిరాతకుడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్ లోని ఇటా ప్రాంతంలోని అలీగంజ్ సమీపంలో పూజారి అనే పాత నేరస్తుడు తన నలుగురు స్నేహితులతో కలిసి దీపూకశ్యప్ అనే ఓ చిరు వ్యాపారికి నాలుగు ఆమ్లెట్లు ఆర్డరిచ్చాడు. వ్యాపారి ఆమ్లెట్లు వేసి ఇచ్చాడు. ఆమ్లెట్లను చూసిన పూజారి అందులో ఉల్లిపాయలేవని అడిగాడు.
ఉల్లిపాయలు కొనే స్థోమత తనకు లేదని, అందుకే ఉత్త ఆమ్లెట్లు ఇస్తున్నానని సమాధానమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పూజారి జేబులోంచి తుపాకీ తీసి అతడిని కాల్చిపడేశాడు. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.