: కలదనెడు జీవం కలదో లేదో...!?


అక్కడ జీవం ఉండే అవకాశం ఉంది... అదిగో అక్కడి నుండి వచ్చిన ఛాయాచిత్రాల్లో ఒక మనిషి రాతిపై కూర్చున్నట్టుగా కనిపిస్తోంది... ఇదిగో ఈ చిత్రంలో ఒక ఎలుక కనిపిస్తోంది చూడండి... అంటూ శాస్త్రవేత్తలు ఛాయాచిత్రాలను చూసి తమకు తామే ఏవేవో ఊహా చిత్రాలను గీసేసుకుంటూ అంగారకుడిలో జీవం ఉండే అవకాశం ఉందంటూ... జీవం ఉందంటూ చెబుతూ వస్తున్నారు. అసలు అక్కడ జీవం ఉంటుందా? అనేది చాలాకాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న విషయం. అసలు అంగారకుడిపై జీవం ఉనికిని గురించి నిగ్గుతేల్చడానికిగాను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రోవర్లను పంపిన విషయం తెలిసిందే. ఈ రోవర్లు అక్కడ జీవంకోసం తమ అన్వేషణ సాగిస్తున్నాయి. అక్కడ ఉపరితలానికి సంబంధించిన పలు ఛాయా చిత్రాలను తీసి భూమిపైకి పంపాయి కూడా. వాటిని చూసే శాస్త్రవేత్తలు ఇలా భ్రమకు లోనయ్యారు. అయితే ఈ అన్వేషణకు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు జీవం ఉనికికి కారణమయ్యే మీథేన్‌ వాయువు అంగారకుడిపై లేదని నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ తేల్చేసింది.

గత ఏడాది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అరుణగ్రహంపై జీవం గురించి పరిశోధనలు సాగించడానికి క్యూరియాసిటీ రోవర్‌ను పంపింది. ఈ రోవర్‌ తన పరిశోధనల్లో అరుణగ్రహంపై జీవం ఉనికికి కారణమయ్యే మీథేన్‌ వాయువు లేదని తేల్చింది. నిజానికి ఈ విషయం కూడా శాస్త్రవేత్తల్లో సందేహాన్ని కలిగిస్తున్న విషయం. ఆ గ్రహంపై మీథేన్‌ వాయువు ఉందా... అనేది చాలా కాలంగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉండేది. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ అసలు అక్కడ మీథేన్‌ వాయువు లేదని క్యూరియాసిటీ రోవర్‌ తేల్చింది. ఈ వాయువు జీవం ఉనికికి సంబంధించిన ఒక సంకేతం. జీవులు లేకుండా ఈ వాయువు ఉండే అవకాశం ఉంది. గతంలో అమెరికా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో అరుణగ్రహంపై మీథేన్‌ జాడ ఉన్నట్టు కొన్ని సానుకూలమైన సంకేతాలు అందాయి. అయితే ఇప్పుడు క్యూరియాసిటీ పంపిన డేటా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఏడాది అక్టోబరు నుండి ఈ ఏడాది జూన్‌ వరకూ అంగారకుడి వాతావరణానికి సంబంధించిన నమూనాలను ఈ రోవరు ఆరుసార్లు విశ్లేషించింది. ఈ విశ్లేషణలో ఎక్కడా కూడా మీథేన్‌ వాయువుకు సంబంధించిన ఆచూకీ దొరకలేదు. దీంతో అసలు అంగారకుడిపై జీవం ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News