: మీ విధానాలు మార్చుకోకుంటే ఇక మీకు రాజకీయ సన్యాసమే!: జంధ్యాల రవిశంకర్
తమతో కలిస్తే రాష్ట్రం విశాలమవుతుందని మభ్యపెట్టి, కర్నూలులో ఉన్న మనల్ని అప్పటి తెలంగాణ నేతలు హైదరాబాద్ కు తీసుకెళ్లారని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఆయన మాట్లాడుతూ... 'అందరం కలిసి ఉందాం అని, విశాలాంధ్ర అని మభ్యపెట్టి, ఆ తరువాత మేము అన్యాయమైపోతున్నామంటూ కొత్త పల్లవి అందుకున్నారని' అన్నారు. అప్పుడు ముల్కీ నిబంధనలు అంటూ తప్పుడు కూతలు కూస్తే, మన రాజధానిలో మనం రెండవ శ్రేణి పౌరులుగా మిగిలిపోతామని, అది తమకు సమ్మతంకాదని ఇప్పటి బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు వంటి నేతలు ఉద్యమం చేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు సిగ్గులేని వాదనలు చేస్తూ రాజకీయనాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 'ప్రజలను మోసం చేస్తూ మీ కుటుంబాలు ఎలా సుఖంగా ఉంటాయ'ని ఆయన నిలదీశారు. మీ విధానాలు మార్చుకోకుంటే రాజకీయ సన్యాసమే దక్కుతుందని సీమాంధ్ర రాజకీయ నాయకులను హెచ్చరించారు. ఇప్పుడున్న రాజకీయనాయకులను కానీ, వారి కుటుంబసభ్యులను కానీ, మరో 30 ఏళ్ల వరకు ఇక్కడి ప్రజలు ఎన్నుకోరని ఆయన జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్ర పక్షపాతి అంటూ ఆడిపోసుకుంటున్న తెలంగాణ నేతలని, 'దమ్ముంటే ప్రభుత్వాన్ని పడగొట్టమని' జంధ్యాల రవిశంకర్ సవాలు విసిరారు. సీమాంధ్ర మంత్రులు, నేతలు తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా, లేక 'మా సమ్మతి లేకుండా మమ్మల్ని విభజిస్తున్నారని' రాష్ట్రపతికి మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినా కేంద్రం పడిపోదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 'కోట్ల మంది ప్రజలతో ఆడుకోకండి' అంటూ రాజకీయనాయకులకు హితవు పలికారు.