: తలవంపులు తెచ్చారు.. లేపేశాం: ప్రేమికురాలి తండ్రి
హర్యానాలో పరువు హత్యలు ఆగడం లేదు. పరువు పోయిందంటూ నిండుజీవితాలను బలి తీసుకుంటున్నారు. అగ్రవర్ణాల్లో, ప్రధానంగా జాట్ కులస్తుల్లో ఈ జాఢ్యం ప్రబలంగా కనిపిస్తోంది. తాజాగా హర్యానాలోని రోహటర్ జిల్లాలో జాట్ కులానికి చెందిన నరేందర్ అలియాస్ బిల్లు తన కుమార్తె నిధి(18), ఆమె ప్రేమికుడు ధర్మేంద్ర(22) లను గ్రామం నడిబొడ్డున తల నరికి చంపేశారు. అయినప్పటికీ జరిగిన ఘోరంపై ఎవరూ పెదవి విప్పడంలేదు. పోలీసులు ఎదుట నేరాన్ని ఒప్పుకున్న నిధి తండ్రి, మావయ్యలు తాము చేసిన హత్యపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని, కుల గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను ప్రేమపేరుతో మంటగలిపిన వారికి ఇలాంటి శిక్షే విధించాలని పేర్కొన్నారు. దానికి తాము శిక్ష అనుభవించినా ఫర్వాలేదని వారు తెలిపారు. ప్రేమే నేరమన్నట్టు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న క్రూరులను కఠినంగా శిక్షించాలని హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.