: ఆడపిల్లలు పుట్టారని విడాకులు కోరుతున్న ఐఏఎస్
ఓ ఐఏఎస్ అధికారి వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని అతడు భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ మేరకు విశాఖ జీసీసీ ఎండీ రమేష్ కుమార్ పై అతని భార్య స్వప్న త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య విడాకుల వివాదం నడుస్తోంది. మ్యూచువల్ డైవోర్స్ ఇవ్వాలని రమేష్ కోరుతుండగా అతని భార్య మాత్రం విడాకులకు అంగీకరించడం లేదు. దీంతో అప్పట్లో స్వప్న స్త్రీశిశుసంక్షేమ శాఖకు ఫిర్యాదు కూడా చేసింది.
తరువాత వారి చొరవతో కలిసి ఉంటున్నప్పటికీ రమేష్ కుమార్ వేధింపులు ఎక్కువ కావడంతో ఈ రోజు ఉదయం స్వప్న కుటుంబసభ్యులు, మహిళా సంఘాల నేతలతో కలిసి అతని ఇంటివద్ద ఆందోళనకు దిగారు. వేధింపుల ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు వారిని అక్కడినుంచి తరలించి, ఏసీపీ డీఎస్ మహేష్ ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నారు.