: ఇలా వయసు తగ్గించుకోండి


మీ వయసును తగ్గించుకోవాలనుకుంటున్నారా... అయితే కొన్ని ఆరోగ్య సూత్రాలను ఫాలో అయిపోండి... అప్పుడు మీరు మీ వయసుకన్నా తక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేక అధ్యయనాలను నిర్వహించి చెబుతున్నారు. పెరుగుతున్న వయసును ఎవరూ నియంత్రించలేరు. అయితే వయసుతోబాటు శరీరంలో వచ్చే మార్పులను అడ్డుకోవడానికి కొన్ని ప్రత్యేక మార్గాలు మాత్రమే ఉన్నాయి. వాటినే శాస్త్రవేత్తలు గుర్తించి చెబుతున్నారు. ఈ మార్గాల ద్వారా పెరిగిన వయసు ఛాయలు మేనిపై లేకుండా చేసుకోవచ్చని చెబుతున్నారు.

మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడంతోబాటు మన దైనందిన జీవన శైలిలో కూడా కొన్ని మార్పులను చేసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరిజేరవని పరిశోధకులు చెబుతున్నారు. సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామం చేయడం, ఒత్తిడిని అధిగమించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వంటివి అలవాటు చేసుకున్న వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపించవచిన పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సుమారు ఐదేళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

శరీరంలోని డీఎన్‌ఏలో ప్రధాన భాగమైన టెలోమీర్స్‌ వయసు కణాల జీవితకాలానికి ఉపయోగపడతాయి. ఈ టెలోమీర్స్‌ పరిమాణం తగ్గిపోతే వయసు కణాల జీవిత కాలం త్వరగా ముగిసిపోతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు బయటపడతాయి. అందుకే మన రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాలు అధిక మొత్తంలో తీసుకోవడంతోబాటు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే రోజుకు సుమారు అరగంటపాటు సరైన వ్యాయామం చేయడం, ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటిని చేయడంతోబాటు ఆత్మీయుల అండ తీసుకోవడం వంటివాటివల్ల వయసు ప్రభావాన్ని అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి జీవన శైలిని అలవరచుకున్న వ్యక్తుల్లో దాదాపు పదిశాతం వరకూ టెలోమీర్స్‌ పరిమాణం పెరిగినట్టు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. అలాగే ఇలాంటి క్రమబద్ధమైన జీవన పరిమాణం లేని వ్యక్తుల్లో టెలోమీర్స్‌ పరిమాణం మూడు శాతం వరకూ తగ్గినట్టు ఈ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి సంతులిత ఆహారం, చక్కటి వ్యాయామంతోబాటు యోగా, ధ్యానం వంటి వాటిద్వారా వయసు ప్రభావాన్ని అడ్డుకోవచ్చు!

  • Loading...

More Telugu News