: నీనా మాట ఓ గెలుపు బాట!
అందమంటే బాహ్య సౌందర్యం కాదు... మానసిక సౌందర్యం అని ప్రపంచానికి చెప్పిన వేళ.. ప్లాస్టిక్ సర్జరీతో వచ్చే అందం కన్నా... తల్లిదండ్రులిచ్చిన అందమే గొప్పదని లోకానికి తెలియజేసిన వేళ.. అగ్రరాజ్యంలో ఒక తెలుగమ్మాయి సగర్వంగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. విజయవాడకు చెందిన నీనా దావులూరి మిస్ అమెరికాగా గెలుపొంది... యావత్ తెలుగు జాతిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈమె గెలుపుతో భారత ప్రజానీకమే కాక... యావత్ ప్రపంచం ముగ్దురాలైంది. అయితే ఈ గెలుపు మామూలు గెలుపు కాదు. ఆత్మన్యూనతతో కుచించుకుపోయే ఎంతో మంది అమ్మాయిల్లో ఇది ఆత్మస్థైర్యాన్ని నింపబోతోంది. రంగు తక్కువ, లావెక్కువ అనుకొని బాధపడే అమ్మాయిల్లో పెనుమార్పులు తీసుకురాబోతోంది. నీనా సాధించిన ఈ అద్భుతం నల్లేరు మీద నడకలా రాలేదు. అసలు అందాల పోటీలపై ఆలోచనే లేని అమ్మాయి... ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో చూద్దాం.
నీనా వాళ్ల ఊరు విజయవాడ అయినప్పటికీ, ఆమె పుట్టక ముందే ఆమె తల్లిదండ్రులు న్యూయార్క్ లో స్థిరపడ్డారు. తండ్రి ధనకోటేశ్వరరావు పేరున్న గైనకాలజీ నిపుణుడు. తల్లి షీలాది సాఫ్ట్ వేర్ రంగం. అమెరికాలో పుట్టినప్పటికీ మూడేళ్లవరకు అమ్మమ్మ కోటేశ్వరమ్మ దగ్గర పెరిగింది నీనా. మూడేళ్ల తర్వాత నీనాను అమెరికా తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. అమెరికా వెళ్లినంత మాత్రాన ఆమెకు మన తెలుగుదనం దూరం కాలేదు. ఎందుకంటే ఆమె నాన్న తరపు బంధువులంతా అమెరికాలోనే స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్నా వారంతా తెలుగులోనే మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో ఆమెకు చిన్నప్పటినుంచి తెలుగు భాషపై పట్టు దొరికింది. అంతే కాకుండా మన ఆచార వ్యవహారాలపై కూడా ఆమెకు మంచి అవగాహన ఉంది.
అమెరికాలో ఉన్నప్పటికీ నీనా ప్రతి ఏడాది వేసవి సెలవులకు తన అక్కతో కలిసి విజయవాడ వస్తుంటుంది. ఇక్కడ అమ్మమ్మ, పెద్దమ్మ డాక్టర్ శశిబాల దగ్గర మూడు నెలలు గడిపి అమెరికా వెళ్లి పోతుంటుంది. అలా విజయవాడలో గడిపిన సమయంలో కూచిపూడి, భరతనాట్యం, వీణ, పియానో లాంటివి నేర్చుకుంది. అంతేకాదు ఆమెకు తెలుగు సినిమాలు చూడటమన్నా చాలా ఇష్టం. ప్రభాస్ తన అభిమాన నటుడని... వర్షం సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని తెలిపింది.
నీనాకి చదువుతో పాటు సేవాకార్యక్రమాలన్నా చాలా ఇష్టం. ఇది ఎలా మొదలైందనే దానికి ఒక చిన్ని కథ చెప్పాల్సిందే. చిన్నతనంలో సెలవులు వచ్చినప్పుడు, నాన్నతో కలసి ఆయన పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లేది. అక్కడ ఆయన చేస్తున్న వైద్యంతో ఎంతో మంది ఆరోగ్యవంతులవడం గమనించింది. దీంతో తాను కూడా డాక్టర్ అయి ఎంతో మందికి సేవ చేయాలనుకుంది. దానికి తగ్గట్టుగానే చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. చిన్నారులకోసం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థల్లో చేరి, వారు నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ కార్యక్రమాలు కూడా ఆమెతో పాటే పెరిగి పెద్దవవుతూ వచ్చాయి. ఇప్పటికీ చిన్నారుల వైద్యం కోసం డాన్స్, మారథాన్ వంటి కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరిస్తూనే ఉంటుంది. ఉన్నత వైద్య విద్యను అభ్యసించడమే ఆమె లక్ష్యం. ప్రస్తుతం నీనా మిచిగాన్ విశ్వవిద్యాలయంలో బ్రెయిన్ బిహేవియర్ అంశంపై ప్రాజెక్టు వర్క్ చేస్తోంది. చదువులో కూడా ఎప్పుడూ ముందుండే నీనాకు ఇప్పటికే యూనివర్శిటీ మెరిట్, నేషనల్ ఆనర్స్ సొసైటీ అవార్డులు లభించాయి.
చదువుకీ, సేవా కార్యక్రమాలకి ఎంతో విలువనిచ్చే నీనా ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టడం అనుకోకుండానే జరిగింది. తను టీనేజీలో ఉండగా చాలా లావుగా ఉండేది. దీనికి కారణం అప్పట్లో తను బులీమియా వ్యాధితో బాధపడుతుండటమే. బులీమియా వ్యాధిగ్రస్తులకు ఆకలికాకపోయినా అధిక తిండి తినాలనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో నీనా తాను తీసుకునే ఆహారంపై నియంత్రణను పూర్తిగా కోల్పోయింది. దీంతో విపరీతంగా లావెక్కింది. నీనాకి తెలుగింటి వంటకాలంటే చాలా ఇష్టం. అయితే ప్లస్ టూకి వచ్చిన తర్వాత నాజుగ్గా మారడానికి నీనా మానసికంగా సిద్ధమయింది. ఎంతో కష్టపడి 30 కిలోలు తగ్గి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకుంది. ఇదే సమయంలో ఆమె స్నేహితులు కొందరు మిస్ టీన్ పోటీలకు దరఖాస్తు చేశారు. తను కూడా ఆ పోటీలో సరదాగా పాల్గొంది. అయితే ఆ పోటీలో కొన్ని వందల మందిని అధిగమించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇంకేముంది... వెంటనే ప్రముఖ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండమని వెంటపడ్డాయి. కానీ, చదువే తనకు ముఖ్యమని, నీనా ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించింది. ఇలా కొంత కాలం గడచిన తర్వాత ఆమె డిగ్రీ పూర్తయింది. ఆర్నెల్ల విరామం దొరికింది.
ఏ వ్యక్తికైనా అద్భుతాన్ని సాధించడానికి టైం రావాలంటారు. ఇప్పుడు అది నీనా తలుపు తట్టింది. స్థానికంగా అందాల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటన చూసింది. వెంటనే అప్లై చేసింది. ఊహించినట్టుగానే ఆ పోటీలలో నీనా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఆమె మిస్ న్యూయార్క్ పోటీలకు ఎంపికైంది. నీనా కష్టం ఇక్కడనుంచే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే మిస్ న్యూయార్క్ పోటీలంటే సాదాసీదా కాదు. ఎంతో మంది అందగత్తెలు అక్కడ పోటీలో ఉంటారు. అయినా సరే వెనకడుగు వేయరాదనుకుంది నీనా. దీంతో తన శరీరంపై మరింత దృష్టి పెట్టింది. తనకెంతో ఇష్టమైన భారతీయ వంటకాలకు దూరమైంది. జంక్ ఫుడ్, ఐస్ క్రీం, చాక్లెట్ల గురించి ఆలోచించడం కూడా మానేసింది. కేవలం అమ్మ చేతి వంట మాత్రమే తినేది. దీనికితోడు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి... ధ్యానం, యోగా, ఏరోబిక్స్ చేయడం మొదలుపెట్టింది. ధ్యానంతో మానసిక ధృడత్వాన్ని పెంచుకుంది. మిస్ న్యూయార్క్ పోటీలకు అన్నిరకాలుగా సిద్ధమైంది. జూన్ లో జరిగిన మిస్ న్యూయార్క్ పోటీల్లో పాల్గొన్న నీనా... అందులో ప్రథమ స్థానాన్ని సాధించి మిస్ అమెరికా పోటీలకు అర్హత సాధించింది. నీనాకి ముందు ఇంతవరకు మిస్ న్యూయార్క్ పోటీలో గెలిచిన తెలుగమ్మాయే లేదు. మిస్ న్యూయార్క్ పోటీలో వచ్చిన నగదు బహుమతిని కూడా నీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్యం కోసం అందజేసి తన గొప్పదనాన్ని చాటుకుంది.
ఇంతలో మిస్ అమెరికా పోటీలు రానే వచ్చాయి. ఈ పోటీలో తనతో కలిపి 53 మంది అందాల భామలు పోటీ పడ్డారు. ఎన్నో రకాల వడపోతలు. అన్నింటిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. ఒక్కో రౌండ్ దాటుకుంటూ పోయింది. ప్రతిభను చాటుకునే విభాగంలో... మన సంప్రదాయ దుస్తుల్లో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించింది. బాలీవుడ్ పాటలకీ స్టెప్పులేసింది. చివరకు మిస్ అమెరికాగా మెరిసిపోయింది.
అమెరికన్ల రంగుతో పోలిస్తే నీనా రంగు తేలిపోయేదే. ఇంకా చెప్పాలంటే చామనఛాయ కంటే కొంచెం ఎక్కువ. అయితేనేం? మానసిక అందంతో మురిపించి, మెరిసింది. ప్లాస్టిక్ సర్జరీలతో తెచ్చుకునే కృత్రిమ మార్పుల కంటే పుట్టుకతో మనకొచ్చే అందమే గొప్పదని ఆమె చెప్పిన సమాధానంతో అందాల పోటీల ప్రాంగంణం చప్పట్లతో మారుమ్రోగింది. ఆమె భావనతో ఏకీభవించిన న్యాయ నిర్ణేతలు ఆమెను అమెరికాలోనే అత్యంత అందమైన వనితగా ప్రకటించారు. దీంతో మిస్ అమెరికా కిరీటం ఆమె సొంతమయింది.
నీనా దావులూరి గెలుపు... ఎందరికో స్పూర్తి నివ్వబోతోంది. లావుగా ఉన్నామనో, రంగు తక్కువగా ఉన్నామనో ఆత్మన్యూనతకు గురయ్యే ఎంతో మందికి ఈమె విజయం ఒక మార్గదర్శకం. మానసిక అందంతో దేన్నైనా సాధించవచ్చనే నీనా మాట ఓ గెలుపు బాట!