: రాజమౌళి తండ్రికి ఎందుకు వారెంట్ జారీ చేశారంటే..
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై నాంపల్లి క్రిమినల్ కోర్టు నిన్న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత చెంగల వెంకట్రావు ఫిర్యాదు మేరకే ఈ వారెంట్ జారీ అయింది. గతంలో తనకు కథ ఇస్తానని చెప్పి విజయేంద్ర ప్రసాద్ రూ.41 లక్షలు తీసుకున్నారని, అయితే ఒప్పందం ప్రకారం కథ ఇవ్వలేదని ఫిర్యాదులో వివరించారు.
అయితే, అప్పట్లో తాను కేసు పెడతానంటే భయపడిన రాజమౌళి తండ్రి తనకు రూ.30 లక్షలకు చెక్కులిచ్చారని, అవి బౌన్స్ అయ్యాయని వెంకట్రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని తెలిపారు. విచారణకు హాజరుకాకపోవడంతో విజయేంద్ర ప్రసాద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని చెప్పారు. కాగా, విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వకపోవడంతో తాను మరో రచయిత నుంచి కథ తీసుకుని 2005లో 'నరసింహుడు' సినిమాను విడుదల చేశానని నిర్మాత వెంకట్రావు వెల్లడించారు.