: నేటి నుంచి ఛాంపియన్స్ లీగ్ టీ20 అర్హత పోటీలు
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో మెగా టోర్నీ సిద్ధమైంది. అంతర్జాతీయ జట్లు పాల్గొనే ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫైయింగ్ రౌండ్ మొహాలీలో ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. రాకెట్లలా దూసుకుపోయే ఫోర్లు, ఆకాశాన్నంటే సిక్సర్లు, బుల్లెట్లలా దూసుకొచ్చే యార్కర్లు... టోర్నీ ఆద్యంతం క్రికెట్ అభిమానిని అలరించనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ లో తొలి మూడు స్థానాలను సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తో పాటు బ్రిస్బేన్ హీట్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, హైవెల్డ్ లయన్స్, పెర్త్ స్కార్చర్స్, టైటాన్స్ ఇప్పటికే మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, ఒటాగో వోల్ట్స్, ఫైసలాబాద్ వోల్వ్స్, కందురత మెరూన్స్ మధ్య పోటీ నెలకొంది. ఈ నాలుగు జట్లు మూడేసి మ్యాచ్ లు ఆడనుండగా... టాప్ లో నిలిచిన రెండు జట్లు మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తాయి.
ఈ రోజు తొలిమ్యాచ్ లో ఫైసలాబాద్ వోల్వ్స్ తో ఒటాగో వోల్ట్స్ తలపడనుంది. రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్.. కందురత మోరూన్స్ తో ఢీకొననుంది. ఫైసలాబాద్ జట్టుకు మిస్బా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ జట్టుకు భీకర ఫాంలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఈ రోజు క్వాలిఫైయింగ్ రౌండ్ లో తొలిమ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.