: ఎవరైనా విశ్వాసం మారదు!
విశ్వాసం... ఈ పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నది ఎవరు? అంటే ఠక్కున మనం చెప్పే సమాధానం కుక్క. విశ్వాసం చూపే విషయంలో కుక్కకు సాటిరాగల జంతువు మరేదీ లేదనే చెప్పవచ్చు. అయితే ఈ కుక్క కేవలం మనుషులకే విశ్వాసం చూపుతుందా... అంటే మనిషైనా... మరమనిషైనా తాను చూపే విశ్వాసంలో తేడా ఉండదంటోంది కుక్క. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా ఋజువు చేశారు. కుక్క విశ్వాసం చూపే విషయంలో మనుషులు, మరబొమ్మలనే తేడాను చూపదట.
హంగేరీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక మనిషి రూపంలో ఉన్న రోబోను ఉంచి ఒక కొత్త తరహా ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా కుక్క యజమాని వచ్చి రోబోతో కరచాలనం చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. యజమాని వెళ్లిపోయిన తర్వాత రోబో మనుషుల్లాగే ఫలానా చోట ఆహారం ఉంది తీసుకోమని కుక్కకు చెప్పింది. వెంటనే కుక్క ఆహారాన్ని తీసుకుంది. అంతేకాదు... మనుషులతో ఉన్నట్టుగా రోబోతోకూడా ప్రేమగా, స్నేహంగా ఉండడం మొదలుపెట్టిందట. దీంతో కుక్కకు విశ్వాసం చూపించడం అనే విషయంలో మనుషులకు మాత్రమే అనే హద్దు లేదని, మర మనుషులకు కూడా విశ్వాసంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.