: సెలవులు ఎక్కువ పెడుతున్నారా...!
మీరు ఉద్యోగంలో సెలవులు ఎక్కువగా పెడుతున్నారా... లేదా చాలా కాలంగా మీరు ఉద్యోగానికి వెళ్లడం లేదా... అయితే మీరు మీ ఉద్యోగాన్ని మారే ఆలోచనలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఏ ఉద్యోగికైనా అవసరానికి కొలువుకు సెలవు పెట్టడం అనేది సాధారణం. అయితే ఇలాంటి సెలవులు లెక్కకు మిక్కుటంగా ఉంటేమాత్రం ఇక ఆ ఉద్యోగి తన కొలువుకు గుడ్‌బై చెబుతాడట. కొందరు నిపుణులు ఈ విషయంపై ప్రత్యేకమైన సర్వేను నిర్వహించి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు.
కొందరు తాము చేస్తున్న ఉద్యోగం మారాలనుకుంటే ఇక అప్పటి వరకూ చేస్తున్న కొలువుకు సెలవు పెట్టి కొత్త కొలువుకోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయినా దీర్ఘకాలం పాటు సెలవులో కొనసాగితే ఇక సదరు ఉద్యోగులు అప్పటివరకూ చేస్తున్న కొలువును వదిలేసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. అందునా ఉద్యోగాన్ని వదిలిపెట్టాలని కోరుకునేవారు దీర్ఘకాలం పాటు సెలవులో ఉంటే అలాంటి వారు కచ్చితంగా ఉద్యోగాన్ని వదులుకుంటారని ఈ సర్వే చెబుతోంది. సెలవులో ఉన్న సమయంలో దొరికే విరామం, మానసిక పరమైన ప్రశాంతత, రోజువారీ చేసే పనినుండి విముక్తి ఇలాంటివన్నీ కూడా ఉద్యోగులు స్వీయ అంచనా వేసుకోవడానికి ఈ దీర్ఘకాలిక సెలవులు ఉపకరిస్తాయని మాన్‌స్టర్.కామ్‌కు చెందిన కెరీర్ సలహాల నిపుణులు మేరీ ఎలెన్ స్లేటర్ చెబుతున్నారు.