: టీ కాంగ్రెస్ నేతల సమావేశంలో గందరగోళం
హైదరాబాదులో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరుగుతున్న ఈ భేటీకి రేణుకా చౌదరి హాజరుకావడంపై ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన రేణుక సమావేశంలో ఎలా పాల్గొంటారని వారు ప్రశ్నించారు. తొలుత రేణుక సమావేశం జరుగుతున్న హాల్లోకి రాగానే పొన్నం బయటికివెళ్ళేందుకు సిద్ధపడ్డారు. ఆయనను ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వారించారు. దామోదర్ రెడ్డి మాత్రం తీవ్ర స్వరంతో ఆమెను ప్రశ్నించారు. ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. అయితే జానారెడ్డి కల్పించుకుని.. అందరినీ కలుపుకుని వెళ్ళాలని సర్దిచెప్పారు. కాగా, ఈ భేటీకి కేంద్రమంత్రి బలరాం నాయక్, వీహెచ్, నంది ఎల్లయ్య తదితరులు కూడా హాజరయ్యారు.