: ఇలా మీ బరువును అదుపులో ఉంచుకోండి
రోజువారీ జీవన విధానంలో మహిళలు తమ శరీర బరువు పెరుగుదల గురించి పెద్దగా పట్టించుకోరు. దీంతో కొద్దిరోజుల తర్వాత తమ శరీర ఆకృతిని చూసి ఆందోళన చెందుతుంటారు. అప్పుడు బరువు తగ్గడంపై దృష్టి సారిస్తుంటారు. అయితే అప్పటికే అధిక బరువు కారణంగా వచ్చే రోగాలు అంకురించి ఉంటాయి. అలాకాకుండా రోజువారీ కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా మహిళలు తమ బరువును అదుపులో ఉంచుకోవడంతోబాటు రోగాల బారినుండి కూడా తమను తాము కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ కి చెందిన శాస్త్రవేత్తలు రోజువారీ జీవన విధానంలో మహిళలు కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా రోగాల బారినుండి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. వీరు నిర్వహించిన తాజా అధ్యయనంలో మహిళలు ప్రతిరోజూ కనీసం 38 నిముషాలపాటు వ్యాయామం చేయడం ద్వారా వారు తమ బరువును అదుపులో ఉంచుకోవడంతోబాటు, శరీరాన్ని రోగాలనుండి కాపాడుకోవచ్చని తేలింది. కాబట్టి మహిళలు రోజూ తమకంటూ కనీసం 38 నిముషాలపాటు సమయాన్ని కేటాయించుకుని, ఆ సమయంలో చక్కటి వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోబాటు అధిక బరువును కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.