: పాక్ ఘోర పరాభవం
పాకిస్థాన్ జట్టు బలహీన జింబాబ్వే చేతిలో ఘోర పరాభవం చవిచూసింది. జింబాబ్వేలోని హరారె స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ జట్టు 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 1998 తర్వాత జింబాబ్వే జట్టు పాక్ పై టెస్టుల్లో గెలవడం ఇదే ప్రథమం. 264 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ 239 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే విజయంలో యువ పేసర్ చతారా (5/61) కీలకపాత్ర పోషించాడు. పాక్ జట్టులో కెప్టెన్ మిస్బా ఉల్ హక్ 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్ ఖుర్రమ్ మంజూర్ (54) ఫిఫ్టీ నమోదు చేశాడు.
అంతకుముందు జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్ లో 294 పరుగులు చేయగా, పాక్ 230 పరుగులకు ఆలౌటైంది. 64 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు 199 పరుగులు చేసింది. కాగా, ఈ టెస్టు విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను జింబాబ్వే 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో పాకిస్థాన్ 221 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.