: ఇక గుడ్డుకూడా శాకాహారమే!
కోడి గుడ్డు నాన్ వెజ్జా? వెజ్జా? అనే విషయంలో పలు అభిప్రాయభేదాలున్నాయి. గుడ్డు నాన్‌వెజ్ కాదు... దాన్ని వెజిటేరియన్లు చక్కగా వాడుకోవచ్చని కొందరు చెబుతుంటారు. మరికొందరు గుడ్డు నాన్‌వెజ్జేనంటూ దాన్ని ముట్టరు. అయితే ప్యూర్ వెజిటేరియన్ గుడ్డును తయారుచేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు శాకాహార వస్తువులతో గుడ్డును తయారుచేశారు కూడా. తాము తయారుచేసిన గుడ్డు పూర్తి శాకాహారమేనని చెబుతున్నారు.
అమెరికాలోని హాంప్టన్ క్రీక్ ఫుడ్ అనే సంస్థ పూర్తి శాకాహారంతో గుడ్డును తయారుచేసినట్టు ప్రకటించింది. ఈ గుడ్డులో మామూలు గుడ్డులోని పోషక విలువలన్నీ ఉన్నాయని, అలాగే మామూలు గుడ్డు రుచిలాగే ఉంటుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఈ గుడ్డును జొన్నతో తయారుచేశామని, దీనితోబాటు ఓ రకం బఠాణీ, 11 రకాల మొక్కలతో తయారుచేశామని తయారీదారులు చెబుతున్నారు. అంతేకాదు దీని ధర మామూలు గుడ్డుకంటే కూడా 19 శాతం తక్కువట. మామూలు గుడ్డుతో చేసే అన్ని రకాల ఆహార పదార్ధాలను కూడా దీనితో తయారుచేయవచ్చని చెప్పడంతోబాటు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, పే-పాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థియల్ లు ఈ శాకాహార గుడ్డుకు ఇప్పటికే పెద్ద వినియోగదారులు అయిపోయినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన శాకాహార గుడ్డుతో పోల్చుకుంటే తాము తయారుచేసిన గుడ్డు ఎంతో భిన్నమైనదని హాంప్టన్ క్రీక్ ఫుడ్స్ సీఈవో జోష్ టెట్రిక్ చెబుతున్నారు. ఇవి మనదాకా వస్తే ఇక రోజూ శాకాహార గుడ్డు గుటకాయ స్వాహా చేస్తామేమో!