: సీనియర్ల అరాచకం.. చిన్నారి మృతి
కాలేజీల్లో ప్రారంభమైన ర్యాగింగ్ సంస్కృతి స్కూళ్లకీ పాకింది. ఈ రాక్షస క్రీడ ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని తీసింది. తాజాగా కోల్ కతాలో ఓ దుర్ఘటన సంభవించింది. కొంత మంది సీనియర్లు ఓ చిన్నారిని టాయిలెట్లో బంధించడంతో ఆ బాలిక షాక్ తో మృతి చెందింది. కోల్ కతాలో సంచలనం రేపిన ఈ సంఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోల్ కతాలోని డమ్ డమ్ ప్రాంతంలో ఉన్న క్రైస్ట్ చర్చ్ గర్ల్స్ హైస్కూల్ లో ఆండ్రియిల్లా దాస్ అనే 11 ఏళ్ల చిన్నారి 5వ తరగతి చదువుతోంది.
బుధవారం ఆ బాలికను సీనియర్లు డబ్బుల కోసం డిమాండ్ చేశారు. బాలిక లేవని సమాధానం చెప్పడంతో బాలికను టాయిలెట్ లో వేసి గడియపెట్టారు. భయపడ్డ బాలిక గట్టిగా అరవడంతో స్పందించిన స్వీపర్ తలుపుతీసి బాలికను ఇంట్లో అప్పగించింది. అదేపనిగా ఏడుస్తూ బాలిక షాక్ కు గురవ్వడంతో బాలికను ఆసుపత్రిలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అయినప్పటికీ బాలిక మృతి చెందింది.
దీంతో కోపోద్రిక్తులైన బాలిక బంధువులు స్కూలుపై దాడికి దిగారు. సీనియర్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపాల్ రూంను ధ్వంసం చేశారు. అయితే జరిగిన ఘటనపై తనకు ఏ విధమైనటువంటి సమాచారం లేదని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు విచారణకు ఆదేశించారు.