: ఆశారాంకు భక్తుల ఝలక్


లైంగిక దాడి ఆరోపణలపై ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపుకు భక్తులు ఝలకిచ్చారు. తాము ఆశారాం ట్రస్టుకు విరాళంగా ఇచ్చిన భూములను తిరిగిచ్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాపు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతారని తాము ఊహించలేదని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణంలో పన్నాలాల్ మహేశ్వరి కుటుంబం ఆశారం బాపు ప్రవచనాలకు ఆకర్షితులై, తమ వంతుగా కొంత భూమిని విరాళంగా ఇచ్చారు. దీంట్లో, స్వామివారు పలు నిర్మాణాలు చేపట్టారు. కొంత భాగంలో వ్యవసాయం కూడా చేస్తున్నారు.

ఉజ్జయిని వచ్చినప్పుడల్లా ఆశారాం ఈ ఆశ్రమంలోనే బస చేస్తుండేవారు. అయితే, కొద్దిరోజుల క్రితం ఓ పదిహేనేళ్ళ బాలిక తనపై ఆశారాం లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ విశ్వాసాలు గాయపడ్డాయని మహేశ్వరి కుటుంబ సభ్యులు అంటున్నారు. అందుకే త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలిసి తమ భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియపై మాట్లాడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News