: నోటితో మాట్లాడి వేలితో వినిపించవచ్చు!
అదేంటి నోటితో మాట్లాడితే వేళ్లలో ఎలా వినిపిస్తుంది... అనుకుంటున్నారా... ఇదంతా టెక్నాలజీ మాయ. మన మనసులోని మాటలను మన చేతివేళ్ల ద్వారా ఎదుటి వ్యక్తికి మనం వినిపించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సరికొత్త మైక్‌ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ మైక్‌తో మనం ఏం మాట్లాడినా... ఎదుటివారికి అదేమీ వినిపించదు కానీ... మన చేతివేళ్లను మనం ఎవరికి మన మాటలను వినిపించాలనుకున్నామో వారి చెవి వద్దకు తీసుకెళితే చాలు... మీ వేళ్లు మీ మాటలను వారికి చెప్పేస్తాయట.
డిస్నీ సంస్థ ఒక సరికొత్త మైక్‌ను ఆవిష్కరించింది. ఈ మైక్‌లో మీరు మాట్లాడింది ఎదుటివారికి వినిపించదుకానీ... మీరు ఎవరికి మీ మాటలను వినిపించాలనుకున్నారో వారి చెవి వద్దకు మీ చేతివేళ్లను తీసుకెళితే చాలు... మీ మాటలను గుసగుసల్లాగా మీ వేళ్లు వారికి వినిపిస్తాయి. అంటే మీ మాటలకు మీ చేతివేళ్లు వాహకాలుగా పనిచేస్తాయన్నమాట. ఇదంతా ఈ ప్రత్యేకమైన మైక్ ద్వారా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మైక్ మీ శబ్ద తరంగాలను ప్రత్యేక నిశ్శబ్ద తరంగాలుగా మార్చుకుంటుంది. ఆ తరంగాలు మీ శరీరాన్నే ఒక వాహకంగా మార్చుకుని మీ శరీర భాగం ఎదుటివారి చెవిని తాకగానే వారికి వినిపిస్తాయి. అంతేకాదు... మీరు తాకిన వ్యక్తి ఆ పక్కవారిని తాకినా... వారు తమ పక్కవారిని తాకినా కూడా ఈ మాటలే ముగ్గురికీ వినిపిస్తాయి. అంటే మీ మాటలు శరీరాలను వాహకాలుగా చేసుకుని ఒకరి నుండి మరొకరికి ప్రసారమవుతాయన్నమాట. ఇలాంటి ఇషిన్-డెన్‌షిన్ అనే ప్రత్యేకమైన మైక్రోఫోన్‌ను డిస్నీ సంస్థకు చెందిన యూరీ సుజుకీ, ఒలివియర్ బావ్, ఇవాన్ పాపీరెవ్ ఆవిష్కరించారు. జపాన్ భాషలో ఇషిన్-డెన్‌షిన్ అంటే మెదడు ఆలోచిస్తే... మనసు దాన్ని వ్యక్తీకరిస్తుంది... అని అర్ధమట. మొత్తానికి మన చేతివేళ్లతోనే మన మాటలను మనకు కావాల్సిన వారికి వినిపించవచ్చన్నమాట...!