: జేఎన్ యూ ఎలక్షన్స్ బరిలో గే, విదేశీ, బిడ్డ తల్లి
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ కు దేశవ్యాప్త ఆసక్తి ఉంటుంది. ఈసారి జేఎన్ యూ ఎన్నికలు వైవిధ్యంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీలన్నీ పటిష్ఠమైన అభ్యర్థులనే బరిలో నిలిపాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఓ గే(స్వలింగ సంపర్కుడు), ఓ బిడ్డకు తల్లి, ఓ విదేశీ విద్యార్థి దూసుకుపోతున్నారు. పాపకు తల్లయిన గుంజన్ ప్రియ జేఎన్ యూలో ఎంఫిల్ స్టూడెంట్. గుంజన్ ఎస్ఎఫ్ఐ తరపున బరిలోకి దిగుతోంది. ప్రచారంలో గుంజన్ కుమార్తె కూడా తల్లికి ఓటేయమని విజ్ఞప్తి చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. వివాహితురాలినైన తాను లింగసమానత్వం కోసం పోరాడుతానని, వివాహిత మహిళలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
మరో అభ్యర్థిగా గే గౌరవ్ ఘోష్ రంగంలో దిగడం అతను కూడా ఎస్ఎఫ్ఐ నుంచి బరిలో దిగడం ఆసక్తి రేపుతోంది. ఇతను లెస్బియన్, గే, ట్రాన్స్ జెండర్(ఎల్ జీబీటీ) కమ్యూనిటీకి సమానహోదా కావాలని కోరుతూ ఎన్నికల బరిలో నిలిచాడు. తమ ఎల్ జీబీటీ కమ్యూనిటీపై వివక్షకు అంతం పలికి, సమానత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఈసారి జేఎన్ యూ ఎన్నికల్లో అధ్యక్షపదవికి కజికిస్థాన్ కు చెందిన అక్మెత్ బెకోవ్ ఝాస్సులాన్ ఓ అనువాదకుడి సాయంతో పోటీ పడుతున్నాడు.
మాజీ సైనికుడైన ఈ కజికిస్తానీ గతంలో యుద్ధంలో పాల్గొన్నందుకు పలు పతకాలు సాధించాడు. ప్రస్తుతం ఇతను ఎకనామిక్స్ పట్టా పొందేందుకు శ్రమిస్తున్నాడు. ఇతను జేడీయూ తరుపున బరిలో దిగుతున్నాడు. జేఎన్ యూలో భాష ప్రధానంగా అనేక సమస్యలను సృష్టిస్తోందని, అలాంటి సమస్యలు అధిగమించేలా తాను చర్యలు తీసుకుంటానని అతను ప్రచారం చేస్తున్నాడు. కాగా, ఈ నెల 13 న ఎన్నికలు జరగనున్నాయి.