: గుండెపోటుకు ఇదే కారణం


కొంతమంది ఆరోగ్యవంతంగా ఉన్నా కూడా వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటుకు పలు కారణాలు చెప్పవచ్చు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎలాంటి దురలవాట్లు లేకుండా ఉండేవారికి కూడా ఒక్కోసారి రక్తనాళాలు మూసుకుపోయి గుండెకు రక్తసరఫరా ఆగిపోతుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. దీనికి కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయం, ఇటలీలోని వైద్య కేంద్రాల పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ప్రత్యేక తరహా గుండెపోటుకు కారణమయ్యే జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యువును గుర్తించడం వల్ల భవిష్యత్తులో కొత్తరకం ఔషధాలను అభివృద్ధి చేయడానికి మార్గం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ పాలోటమారో ఈ విషయాన్ని గురించి వివరిస్తూ, ఆరోగ్యవంతంగా ఉండేవారిలో ఒక్కోసారి రక్తనాళాలు మూసుకుపోయి గుండెకు రక్తసరఫరా ఆగిపోతుంది. దీన్ని వేసోస్పాజంగా వ్యవహరిస్తారు. దీనికి ఒక నిర్ధిష్ట జన్యువు కారణమవుతున్నట్టు ఈ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. ఈ పరిశోధనలో పాల్గొన్న మరొక పరిశోధకులు డాక్టర్‌ ఎంజో ఎమాన్యుయేల్‌ మాట్లాడుతూ ఆరుశాతం మంది రోగుల్లో మాత్రమే తలెత్తే ఈ తరహా గుండెపోటును జన్యుపరమైన సమస్యగా గుర్తించినా, ఏ జన్యువు అనేది ఇంతవరకూ నిర్ధిష్టంగా గుర్తించలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ జన్యువును గుర్తించడం వల్ల ఎవరు ఇలాంటి సమస్య బారిన పడతారనే విషయాన్ని ముందుగానే గుర్తించే వీలవుతుందని చెబుతున్నారు. జన్యువును గుర్తించే ప్రక్రియలో భాగంగా పరిశోధకులు కేఏటీపీ ఛానల్‌గా వ్యవహరించే ప్రోటీన్‌కు సంకేత నిర్మాణం చేశారు. ఈ ప్రోటీన్‌ ఛానళ్లు రక్తనాళాల వ్యాసాన్ని నియంత్రిస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News