: సిక్కులను ముస్లింలుగా పొరపడుతున్న అమెరికన్లు
70 శాతం మంది అమెరికన్లకు సిక్కులంటే ఎవరో తెలియదు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సర్వేలో ఈ నిజాలు వెలుగుచూశాయి. మతపరంగా తలకు పాగా కట్టుకునే సిక్కులను.. అమెరికన్లు ఎలా గుర్తిస్తున్నారన్న కోణంలో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది అమెరికన్లు... సిక్కులను ముస్లింలుగా చెప్పారు. 22 శాతం మంది వీరిని హిందువులుగా, బౌద్ధులుగా, షింటోలుగా పేర్కొన్నారు. కేవలం 29 మంది అమెరికన్లు మాత్రమే సిక్కులను సిక్కులుగానే గుర్తించారు.
చాలా మంది అమెరికన్లు సిక్కులకు బిన్ లాడెన్ లేదా ఇతర రాడికల్ గ్రూప్ లతో సంబంధాలు ఉండవచ్చన్న భావనలో ఉన్నారని ఈ సర్వే నిర్ధారించింది. చాలా మందికి సిక్కుల గురించి, వారి సంస్కృతి గురించి తెలియదని తెలిపింది. సెప్టెంబర్ 11 (2001) దాడి తర్వాత అమెరికాలో సిక్కులపై దాడులు ఎక్కువయ్యాయి. పోయినేడాది గురుద్వారాలో తుపాకీతో ప్రవేశించిన ఒక అమెరికా పౌరుడు.. ఆరుగురు సిక్కులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే.
సిక్కులపై దాడులు ఎందుకు ఎక్కువయ్యాయన్న విషయాన్ని కనిపెట్టేందుకు ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో 2,450 మంది పాల్గొన్నారు.