: మంచులో నాలుగు నెలలక్రితం తప్పిపోయి.. దొరికిన వ్యక్తి
నాలుగు నెలల క్రితం ఆండీ పర్వత శ్రేణుల్లో తప్పిపోయిన గోమెజ్ అనే 58 ఏళ్ల వ్యక్తి అర్జెంటీనాలో క్షేమంగా కన్పించడం అధికారులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. డీహైడ్రేషన్, కాస్త బలహీనత తప్ప అతని ఆరోగ్యానికెలాంటి ముప్పు లేదని వైద్యులు తెలపడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు నెలలు ఎలా రక్షణ పొందావని అడగగా తన దగ్గరున్న ఎండు ద్రాక్షతో పాటు పర్వతారోహకులు ఆశ్రయం పొందే శిబిరాల్లో తినుబండారాలతో తన కడుపు నింపుకొన్నట్టు తెలిపాడు.
గోమెజ్ గత మేలో తప్పిపోయాడు. ఆ తరువాత ఆండీ పర్వత శ్రేణుల్లో పెద్ద ఎత్తున మంచు తుఫానులు చెలరేగాయి. దీంతో అతడి అన్వేషణ చర్యలను జులైలో ఆపేశారు. అలాంటిది వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు గోమెజ్ ఎదురుపడడం అద్భుతమని అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.