: ముంబైలో బంగారు బొజ్జ గణపయ్యలు.. వందల కోట్లకు ఇన్సూరెన్స్
ముంబై వాసులు ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. మట్టి విగ్రహాలకు మనస్ఫూర్తిగా దాతలు బంగారాన్ని పెద్ద మొత్తంలో విరాళంగా ఇస్తుండడం విశేషం. దీంతో గణనాథులు బంగారు నగలతో మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ముసురుకున్నా.. భక్తితో గణనాథుడిని సేవిస్తే కష్టాలన్నీ మటుమాయం అవుతాయనే విశ్వాసం ముంబై వాసులలో మెండుగా ఉంది.
ముంబైలోనే సంపన్న గణేశ మండలి జిఎస్ బీ సేవా మండల్ ఈసారి 12 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ స్వామికి నాలుగు చేతులను బంగారంతో రూపొందించడం విశేషం. అంతేకాదు ఈ గణనాథుడికి విరాళంగా వచ్చిన బంగారు ఆభరణాల బరువు 80 కేజీలు ఉంటుందట. దీంతో సేవా మండల్ 223 కోట్ల రూపాయలకు బీమా చేయించింది. మరో ప్రముఖ మండలి లాల్ బాగ్చా రాజా ఈ ఏడాది స్వామి ఆభరణాలకు 71 కోట్ల రూపాయల బీమా తీసుకుంది. మండపం అలంకరణకే 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగా, 3 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను గణపయ్యకు అలంకరించనున్నారు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఏటా పదుల సంఖ్యలో సినీనటులు, సెలబ్రిటీలు వస్తుంటారు.