: విశ్వం ముగింపు ఎప్పుడో చెప్పే రోజొస్తుందా?
మన మరణమే మనకు తెలియదు..కానీ ఈ విశ్వానికి కూడా అంతమెప్పుడో చెబుతామంటున్నారు భౌతిక శాస్త్రవేత్తలు. ఇందుకు దైవకణం సహాయపడుతోందని ఫెర్మ్ జాతీయ యాక్సలరేటర్ ల్యాబొరేటరీ చెబుతోంది. ఈ దైవకణం మన ముందున్న ఈ సువిశాల విశ్వం ఎన్ని కోట్ల సంవత్సరాలకు అంతం కాబోతుందో కూడా కచ్చితంగా చెప్పగలదని ఈ ల్యాబోరేటరీ పరిశోధకులు జోసెఫ్ లైక్కెన్ స్పష్టం చేస్తున్నారు.
గత సంవత్సరం జెనీవాలో లార్జ్ హైడ్రన్ కొల్లైడర్ తో నిర్వహించిన బిగ్ బ్యాంగ్ ప్రయోగంలో హిగ్స్ బోసన్ (దైవకణం)పై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగంలో ఫెర్మ్ జాతీయ యాక్సలరేటర్ ల్యాబొరేటరీ కూడా భాగస్వామ్యం పంచుకుంది.
కొన్ని కోట్ల సంవత్సరాలకు ఒకసారి జల ప్రళయంలో యుగాంతం సంభవిస్తుందని మత గ్రంథాలన్నీ చెబుతున్నాయి. మళ్లీ తిరిగి కొత్త యుగం ఆరంభమవుతుందని ఆయా మతస్తులు విశ్వసిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో... అసలు ఈ బ్రహ్మాండానికే ముగింపు పలికే రోజొకటుందని భౌతిక శాస్త్రవేత్తలు అంటుంటే ఆశ్చర్యమే మరి!