: చందమామ గుట్టు తెలియనుంది
చందమామపై ఎలాంటి వాతావరణం ఉంది... అక్కడ ఇంకా అంతు చిక్కని విషయాలు ఏం ఉన్నాయి? అనే వాటి గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం చంద్రుని గుట్టు విప్పి చెప్పనుంది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రునిపై ఉన్న వాతావరణానికి సంబంధించిన అంతుచిక్కని విషయాలను గురించి తెలుసుకోవడానికి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. శనివారం నాడు ప్రయోగించిన ఈ ఉపగ్రహంపేరు లూనార్ అట్మాస్మియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోరర్ (లాడీ). దీన్ని వాలాప్స్ దీవిలోని ప్రయోగకేంద్రం నుండి మినోటార్-5 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపింది. సాధారణంగా చందమామ కక్ష్యలోకి పంపే ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని కేప్ కెనర్వాల్ నుండి నాసా ప్రయోగిస్తుంటుంది. వర్జీనియా రాష్ట్రంలోని వాలావ్స్ దీవి నుండి ప్రయోగించడం ఇదే తొలిసారి. చంద్రునిపై వాతావరణం, ధూళిపై ఈ ఉపగ్రహం పరిశోధనలు సాగిస్తుంది. ఇది అక్టోబరు 6న చందమామ కక్ష్యలోకి చేరుకుంటుంది.