: క్రీడాసంఘాల్లో రాజకీయనేతలుంటే ఏం?: రవిశాస్త్రి
మాజీ క్రికెటర్ రవిశాస్త్రి భారత క్రీడా వ్యవహారాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ముంబయిలో అలనాటి క్రికెటర్ దిలీప్ సర్దేశాయ్ స్మారక ఉపన్యాసం ఇచ్చిన రవిశాస్త్రి పలు విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. క్రీడాసంఘాల్లో రాజకీయనేతలకు చోటు కల్పించరాదని ప్రజలు కోరుకోవడం సరికాదన్నారు. జాతీయ క్రీడా సంఘాల్లో రాజకీయ నేతలుంటే తప్పేమిటని ప్రశ్నించారు.
తాజాగా భారత ఒలింపిక్ సంఘంలో రాజకీయనేతల ప్రమేయం ఎక్కువగా ఉందంటూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మన దేశాన్ని ఒలింపిక్ క్రీడకు అనర్హురాలిగా ప్రకటించిన నేపథ్యంలో శాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయనేతలు క్రీడాసంఘాల్లోనూ చక్కని పాలకులుగా పేరుగాంచారని శాస్త్రి వివరించాడు. ఇక అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పై ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసన్ కు రవిశాస్త్రి మద్దతు పలికాడు. శ్రీనివాసన్ ఓ అద్భుతమైన క్రికెట్ ప్రేమికుడని పేర్కొన్నాడు. శ్రీనివాసన్ ఇచ్చిన అండతోనే లలిత్ మోడీ ఐపీఎల్ ను ఆకర్షణీయంగా మలిచాడని తెలిపాడు.