: రేపు హైదరాబాదులో ఏం జరిగినా సీఎందే బాధ్యత: హరీష్ రావు
రేపు హైదరాబాదులో ఏం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలదే బాధ్యతని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. రేపు రాజధానిలో ఎపీఎన్జీవోల సభ జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాదులో సమైక్యవాదుల సభ వెనుక సీఎం, డీజీపీల కుట్ర ఉందని హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాదులో తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం, డీజీపీల ద్వంద్వ వైఖరికి నిరసనగానే రేపు హైదరాబాద్ బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు హరీష్ రావు టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ తో కలిసి హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్వహించే సభకు తాము వ్యతిరేకమని ఈటెల రాజేందర్ చెప్పారు. ముఖ్యమంత్రి తీరును ప్రశ్నించకపోతే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు చరిత్ర హీనులవుతారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.