: నాడీస్పందనతోనే గుండె గుట్టు తెలుసుకోవచ్చు!
నాడీ స్పందనతో మన గుండె ఎలా పనిచేస్తుంది? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మన హృదయస్పందనను వినడం ద్వారా మనకు గుండెపోటు, పక్షవాతం వంటి ముప్పులను ముందుగానే తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ మేరకు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిద్వారా నాడీ స్పందనను విని, దాన్ని విశ్లేషించడం ద్వారా గుండెకు సంబంధించిన ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
అయోవా విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్యారీ పియర్సే ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో ట్రాన్స్‌డ్యూసర్ అనే పరికరాన్ని వేలుమీదగానీ లేదా మోచేతి వద్దనుండే ధమని మీదగానీ పెడతారు. ఇది వ్యక్తుల వయసు, శరీర బరువు, ఎత్తుల నిష్పత్తులను క్రోడీకరించి నాడి కొట్టుకునే తీరునుబట్టి బృహద్ధమని ఎంతవరకు బిగుసుకుపోయింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ బృహద్ధమని బిగుసుకుపోతే గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి వారికి అధిక రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగానే ఉంటాయి. మెడ పక్కలనుండి సాగే కెరొటిడ్ ధమని, తొడవద్ద ధమని వద్ద నాడి ఆధారంగా ప్రస్తుతం బృహద్ధమని గట్టిపడిందో లేదో తెలుసుకుంటున్నారు. అయితే వేలిమీద లేదా మోచేతివద్ద నాడిని చూడడం చాలా తేలికని, దీనివల్ల మరింత కచ్చితంగా ఫలితం కనబడుతుందని పియర్సే చెబుతున్నారు.