: మిస్టర్ డి పొగాకు వ్యతిరేక ప్రచారం
భారత క్రికెట్లో మిస్టర్ డిపెండబుల్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాహుల్ ద్రావిడ్. ఓవైపు వికెట్లు పడుతున్నా మొండిపట్టుదలతో క్రీజులో పాతుకుపోవడం ఈ కర్ణాటక క్రికెటర్ కే చెల్లింది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ద్రావిడ్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్సీ వహిస్తున్నాడు. కాగా, ద్రావిడ్ కున్న సమ్మోహన శక్తిని భారత ప్రభుత్వం వినియోగించుకోవాలని భావిస్తోంది. ద్రావిడ్ ను జాతీయ పొగాకు వ్యతిరేక ప్రచారానికి బ్రాండ్ అంబాసడర్ గా నియమిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో పలు ప్రచార చిత్రాలలోనూ, ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలలోనూ ద్రావిడ్ పాలుపంచుకుంటాడని మంత్రిత్వ శాఖ తెలిపింది.