: ఉద్యమం వెనుక సీఎం ఉన్నారనడం సీమాంధ్రులను అవమానించడమే:పితాని
సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని తెలంగాణ ప్రాంత నేతలు చెప్పడం సీమాంధ్రులను అవమానించడమేనని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి భయపడుతున్న తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అంశం అసెంబ్లీలో తీర్మానానికి వచ్చినప్పుడు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని తాము తెలియజేస్తామని పితాని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు అనడంతో వారి వాదనలో నిజాయతీలేదన్న విషయం అర్ధమవుతోందని మంత్రి పితాని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో తమ వాదన విన్పించే హక్కు అందరికీ ఉందని ఆయన అన్నారు.