: సైకో గోడదూకలేదు.. పోలీసుల నిర్వాకమే
సైకో శంకర్ పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి గోడదూకి తప్పించుకున్నాడని పోలీసులు చెప్పిన మాటలన్నీ కట్టుకథలని అతని సహచర ఖైదీలు విచారణలో చెబుతున్నారు. సైకో శంకర్ వేకువజామున నాలుగు గంటల సమయంలో పోలీసు దుస్తుల్లో 30 అడుగుల గోడెక్కి తప్పించుకున్నాడని, ఆ సమయంలో కరెంటు లేదని, వర్షం పడుతోందని అతను గాయపడ్డాడని పోలీసులు చెప్పినదంతా సినిమా స్టోరీని తలపిస్తుండడం, ఎక్కడో కనెక్టివిటీ మిస్సవుతున్నట్టనిపించడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
దీంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సైకో శంకర్ గత ఆరు నెలలుగా తాను మారిపోయానంటూ కనిపించిన అందరిదగ్గరా క్షోభపడేవాడట. దీంతో సైకో శంకర్ మారిపోయాడని అందరూ నమ్మేశారట. దీంతో అతను బయటకి వెళ్లడానికి పోలీసులే సహకరించారని తెలుస్తోంది. అదెలా అనుకుంటున్నారా? చదవండి... పరప్పన అగ్రహారం జైలులో వందల మంది ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో చాలామంది మద్యానికి బానిసలు. వీరికి మందు అందజేసేందుకు పోలీసులే కొన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రతి రోజూ వారికి మద్యం సరఫరా అవుతుంది. సరఫరా చేసేది కూడా ఖైదీలే కావడం విశేషం. ఖైదీలు ఎలా సరఫరా చేస్తారనే డౌట్ వచ్చిందా? ప్రేమఖైదీ సినిమా చూసారా... అందులో లాగే మంచి ఖైదీలుగా పేరు తెచ్చుకున్న కొంతమంది ఖైదీలను బయటకు పంపించి మద్యం తెప్పిస్తారు. అందులో వచ్చిన లాభంలో 90 శాతం అధికారులు, సిబ్బందికి.. మిగిలిన 10 శాతం మద్యం సరఫరా చేసిన వ్యక్తికి.
దీంతో మద్యం తీసుకొచ్చేందుకు పోలీసులు సైకో శంకర్ తో పాటు కొంత మంది ఖైదీలను పంపించారు. మిగిలినవారు వచ్చారు కానీ, సైకో శంకర్ మాత్రం రాలేదు. తెల్లవారుజాము వరకు ఎదురు చూసిన అధికారులు తెల్లవారాక మీడియాకు కట్టుకథ చెప్పి వెతుకులాట ప్రారంభించారు. అతను దొరక్కపోవడంతో నెత్తి బాదుకుంటున్నారు. అదీ అసలు సంగతి. దీన్ని ఖైదీలు దర్యాప్తు అధికారులకు వెల్లడించారు.