: పోస్టల్ రవాణాలో చైనా కొత్త ఒరవడి
చైనా చాలా విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాలను చేపట్టేందుకు ఉత్సాహం చూపుతుంటుంది. ఇప్పుడు పోస్టల్ విభాగంలో కూడా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. పోస్టల్ విభాగంలో ఉత్తరాలను ఒకచోటునుండి వేరొక చోటుకు చేరవేసేందుకు వాహనాలను ఉపయోగించేవారు. విదేశాలకు చేరవేసేందుకు కూడా విమానాలను, లేదా షిప్పుల్లోను ఉత్తరాలను ఆయా ప్రాంతాలకు చేరవేసేవారు. అయితే చైనా యుద్ద రంగంలో ఉపయోగించే పైలట్ రహిత విమానాలను ఉత్తరాల చేరవేతకు ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఒకచోటునుండి మరొక చోటుకు ఉత్తరాలను చేరవేయడంలో ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉంది? అనే విషయాన్ని బట్టి ఆ ప్రాంతానికి ఉత్తరాలను విమానాల్లో చేరవేయడం అనేది సాధారణమైన విషయమే. అయితే ఇలా మామూలుగా చేస్తే తేడా ఏం ఉంటుంది... అనుకుందో ఏమో మరి చైనా ఒకచోటనుండి మరో చోటుకు ఉత్తరాలను చేరవేయడానికి పైలట్ రహిత యుద్ధ విమానాలను ఉపయోగించనుంది. సుదూర, మారుమూల, దుర్గమ ప్రాంతాలకు కూడా తపాలాను చేరవేయడానికి వీటిని ఉపయోగిస్తారట. షెంజెన్ ప్రాంతానికి చెందిన ఒక సంస్థ ప్రయోగపూర్వకంగా ఈ చేరవేత విధానాన్ని చేపట్టింది. ఎనిమిది ప్రొఫెల్లర్లతో నడిచే ఈ విమానాల్లో మనం పార్సిల్ వెళ్లాల్సిన చిరునామా, ఆ ప్రాంతానికి వెళ్లే దారిని నమోదు చేస్తే చాలట... ఆ విమానాలు మనిషి లేకుండానే రివ్వున ఎగిరి వెళ్లిపోయి... సదరు చిరునామాకు ఉత్తరాలను చేరవేస్తాయట... అంతేకాదు... ఈ విమానాలను దూరంనుండే నియంత్రించవచ్చట.