: రాష్ట్రపతి పాలనలో.. రాష్ట్ర విభజన?


ఆంధ్రప్రదేశ్ విభజన మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రపతి పాలనలో రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర సమాయత్తం అవుతుందన్న వార్తలే ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన దగ్గరి నుంచి సీమాంధ్రలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. 25 రోజులుగా సమ్మెతో సీమాంధ్ర ప్రాంతంలో జన జీవనం స్తంభించిపోయింది. ఈ ఆందోళనను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధిష్ఠానం పెద్దలకు నివేదించి విభజనను విరమించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ కూడా కొంతమేర ప్లేటు ఫిరాయించింది. ఆ పార్టీ ఎంపీలు వర్షాకాల సమావేశాలను తీవ్రంగా అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఇప్పుడు విభజనపై వెనక్కి తగ్గితే తెలంగాణలో ఆందోళనలు మిన్నంటే పరిస్థితులు ఉంటాయని, పైగా పార్టీ పరిస్థితి మరింత దీనంగా మారుతుందని కాంగ్రెస్ యోచన. పరిస్థితి చూస్తుంటే సీమాంధ్రుల ఆందోళనలను పరిష్కరించేంత వరకు అక్కడ సాధారణ పరిస్థితులు కుదుటపడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించి, అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి, ఆంధ్రప్రదేశ్ ను విభజించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నాడు పంజాబ్, హర్యానా విభజన రాష్ట్రపతి పాలనలోనే జరిగింది. అయితే, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనలో నిర్ణయం తీసుకుంటే కోర్టుకెళ్లే యోచనలో సీమాంధ్ర ప్రాంత నేతలున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో విభజన అంశం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News