: భూమిపై నాగరికత ఇలా ప్రారంభమైంది!
భూమిపై నాగరికత ఎలా ప్రారంభమైంది... అనే విషయాన్ని ఇప్పటి వరకూ ఎవరూ కచ్చితంగా చెప్పలేకున్నారు. అయితే కొన్ని వేల ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లే భూమిపై విపరీతమైన మార్పులు సంభవించాయని, నాగరికత అనేది కూడా అప్పటినుండే మొదలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమిపై కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోవడానికి కారణాలు ఏమనే విషయం శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉండేది. డార్ట్మౌత్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇలా భూ వాతావరణంలో మార్పులు సంభవించడానికి కారణంపై పరిశోధనలు సాగించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన ముకుల్ శర్మ అనే శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఈ శాస్త్రవేత్తలు సాగించిన పరిశోధనల్లో కెనడాలోని క్యూబెక్‌లో చోటుచేసుకున్న గ్రహశకలం లేదా తోకచుక్క భూమిని ఢీకొట్టడం వంటి పరిణామంతో భూ వాతావరణ మార్పుకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఈ ఘటన 12,900 ఏళ్ల కిందట యంగర్ డ్రయాస్ కాలం ప్రారంభంలో చోటుచేసుకుంది. అదే సమయంలో భూవాతావరణం ఆకస్మికంగా మారిపోయింది. శీతల, పొడి వాతావరణం ప్రారంభమైంది. దీని ప్రభావం జంతువులు, మానవులపై పడింది. ఉత్తర అమెరికాలో ఒంటెలు, మస్టాడాన్లు సహా పలు భారీ జంతువులు తుడిచిపెట్టుకుపోయాయి. అప్పట్లో నివసించిన క్లోవిస్ అనే తెగకు చెందిన మానవులు వాతావరణ మార్పులకు అనుగుణంగా తమ జీవన శైలిని కూడా మార్చుకున్నారు.
అప్పటివరకూ వేటాడుతూ వచ్చిన వీరు వేటతోబాటుగా ఆహార సేకరణకర్తలుగా మారిపోయారు. వేర్లు, బెర్రీలు వంటి వాటిని ప్రత్యామ్నాయ ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం గురించి ముకుల్ శర్మ మాట్లాడుతూ యంగర్ డ్రయాస్ శీతలీకరణం అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అది మానవ చరిత్రపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపారు. అంతరిక్ష శిల ఢీకొట్టడం వల్ల ఈ పర్యావరణ మార్పులు సంభవించాయనడానికి శాస్త్రవేత్తలు గట్టి ఆధారాలను సేకరించారు. ఈ చర్యవల్ల లేచిపడ్డ ద్రవీకృత శిల తునకలను పరిశీలించి ఈ మేరకు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.