: మంచు గర్భంలో వేల కాలం నాటి వస్తువులు
కొన్ని వేల సంవత్సరాల క్రితం మంచు కింద కప్పబడిపోయిన వస్తువులు, మనుషులకు సంబంధించిన ఆనవాళ్లు క్రమేపీ బయటపడుతున్నాయి. వేల సంవత్సరాల క్రితం నుండి అలా ఘనీభవించిపోయిన మంచు కరుగుతున్నప్పుడు ఈ వేల సంవత్సరాల కాలం నాటి వస్తువులు బయటపడుతున్నాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా నార్వేలోని పర్వతాలతోబాటు పలు ప్రాంతాల్లో మంచు కరుగుతోంది. ఈ మంచు కింద కొన్ని వేల సంవత్సరాలకు చెందిన విల్లు, ఇంకా దుస్తులు వంటివి బయటపడుతున్నాయి.
కరిగిన మంచు కింద కొన్ని విల్లంబులకు సంబంధించిన భాగాలు, కొన్ని దుస్తులు లభించాయి. వీటిలో దుస్తులు ఇనుప యుగానికి చెందినవిగాను, విల్లు భాగాలు సుమారు 6 వేల ఏళ్ల కాలం నాటికి చెందినవిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నార్వేలోని లెండ్బ్రీన్ హిమానీనదం కింద దుస్తులు లభించాయి. ఈ దుస్తులు క్రీస్తు శకం 230-390 మధ్య కాలం నాటికి చెందినవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆకాలంలో చలికి తట్టుకునేలాగా దుస్తులు ఉన్నాయి. వేటాడేందుకు మంచు పర్వతాల వద్దకు వెళ్లే వేటగాళ్లు దీన్ని ధరించేవారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి గుండీలుగానీ, జిప్పులు వంటివిగానీ లేవు. స్వెటర్ తరహాలో దీన్ని తలమీదినుండి ధరించాల్సి ఉంటుంది. ఇలా మంచు కింద లభించిన పురాతన వస్తువులన్నీ కూడా చాలా ఏళ్ల క్రితం మంచుకింద కప్పబడిపోయినా కూడా ఇప్పటి వరకూ ఇంకా భద్రంగానే ఉన్నాయని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మార్టిన్ కాలానన్ చెబుతున్నారు.