: మనలోనే క్షయవ్యాధి మూలాలున్నాయి


క్షయ వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధికి సరైన చికిత్స చేయించుకోకుంటే రోగుల్లో 50 శాతం మంది మరణించే ప్రమాదం ఉంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధికి సుమారు 20 లక్షల మంది బలవుతున్నారు. కాగా ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు ఔషధాలను తట్టుకునే శక్తిని పొందుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ బ్యాక్టీరియా మూలాల గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. ఈ వ్యాధి కారక మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌ క్యులోసిస్‌కు చెందిన 259 రకాల బ్యాక్టీరియాల జన్యుపటాలను ఆవిష్కరించారు. మైకోబ్యాక్టీరియా, మానవ జన్యు పరిణామ వృక్షాలను పోల్చి చూసిన శాస్త్రవేత్తలు ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉందని గుర్తించారు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ రెండు జీవులకు మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

స్విస్‌ ట్రాపికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ (స్విస్‌ టీపీహెచ్‌)కి చెందిన శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో క్షయ వ్యాధికి సంబంధించిన మూలాలు జంతువుల్లో లేవని, ఈ బ్యాక్టీరియా మూలాలు మానవుల్లోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 70 వేల సంవత్సరాల క్రిందట ఆఫ్రికాలో నివసించిన సంచార జాతుల్లో ఈ జబ్బు ప్రారంభమైందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వ్యాధి కారక మైకోబ్యాక్టీరియం, మానవ జన్యు పరిణామ వృక్షాలకు చాలా దగ్గర పోలికలున్నాయిని, దీన్నిబట్టి చూస్తే కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ రెండు జీవుల మధ్య చాలా సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు.

మానవుల తరహాలోనే టీబీ బ్యాక్టీరియా కూడా ఆఫ్రికాలోనే పుట్టిందని, మానవుల్లాగే అది వలస వెళ్లి, ప్రపంచమంతా విస్తరించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక మానవుడిలోని వలసతత్వం, జీవనశైలిలో మార్పులు ప్రమాదకరమైన టీబీ బ్యాక్టీరియా రూపాంతరం చెందడానికి కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పెంపుడు జంతువు నుండి ఈ బ్యాక్టీరియా మానవుల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News