: ఐపీఎల్ లో కిర్ స్టెన్


టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్ గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన క్రికెట్ గురు గ్యారీ కిర్ స్టెన్ ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నాడు. భారత జట్టుకు కోచ్ గా విశిష్ట సేవలందించిన కిర్ స్టెన్ ఐపీఎల్ వచ్చే సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు చీఫ్ కోచ్ గా సేవలందిస్తాడు. ఈమేరకు ఢిల్లీ ఫ్రాంచైజీ, కిర్ స్టెన్ మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఢిల్లీ జట్టు గత ఐపీఎల్ సీజన్లో పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన సంగతి తెలిసిందే. మొత్తం 16 మ్యాచ్ లాడిన డెవిల్స్ 3 విజయాలు 13 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అప్రదిష్ఠపాలయ్యారు.

కాగా, 2008లో టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టిన కిర్ స్టెన్, జట్టు టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోడంలో ఎంతగానో తోడ్పడ్డాడు. అంతేగాకుండా, విదేశీ గడ్డపై పలు అపురూప విజయాలను కిర్ స్టెన్ హయాంలోనే భారత్ జట్టు సాకారం చేసుకోగలిగింది. అన్నింటికి మించి 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ లో ధోనీ సేన జయభేరి మోగించడం కిర్ స్టెన్ కోచింగ్ కెరీర్లో మణిహారంలా నిలుస్తుంది. వరల్డ్ కప్ అనంతరం టీమిండియా కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఈ సఫారీ మాజీ ఓపెనర్ సొంత జట్టుకు కోచ్ గా ఎంపికయ్యాడు. ఇటీవలే కుటుంబ కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

  • Loading...

More Telugu News