: నిప్పులు చెరిగిన బాబు
తెలుగుజాతి ఆత్మ గౌరవ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్వేగంతో ప్రసంగించారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సీమాంధ్రలో కోట్లమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే, సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. విభజన నిర్ణయంతో ప్రజల పొట్టగొట్టే పరిస్థితికి తెరదీశారని అన్నారు. ఇటలీలో పుట్టిన సోనియాకు ఇక్కడి చరిత్ర తెలియదని, కుమారుడు రాహుల్ ను ప్రధాని చేసేందుకే విభజన అని ఆరోపించారు.
అంతకుముందు బాబు తన ప్రసంగం ఆరంభంలో ఎన్టీఆర్ ను కీర్తించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని అభివర్ణించారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగుజాతికి ఎక్కడ ఇబ్బందులెదురైనా ముందుంటుందని వివరించారు. ఎన్టీఆర్ కు ఎన్టీఆరే పోటీ తప్ప మరెవరూ కాదని ఉద్ఘాటించారు. ఉత్తరాఖండ్ వరదల్లో రాష్ట్ర సర్కారు సకాలంలో స్పందిచకపోతే తామే రంగంలోకి దిగి తెలుగువారిని ఆదుకున్నామని బాబు చెప్పారు.