: జైల్లో గంగాజలం కావాలట!
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు గంగాజలం కావాలంటున్నారు. మామూలుగా అయితే, ఆయన కోరగానే శిష్యబృందం ఆగమేఘాలపై సిద్ధం చేసేవారు. కానీ, ఆయన ఇప్పుడు జోధ్ పూర్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గంగాజలం కోరుతున్న ఆయన జైలులో లభ్యమయ్యే తాగునీరు నిరాకరిస్తున్నారట. ఆ నీళ్ళలో ఒక్క చుక్కైనా గంగాజలం కలిస్తేనే, అవి పవిత్రత పొందుతాయని, అప్పుడే వాటిని తాను స్వీకరిస్తానని ప్రవచిస్తున్నాడని జైలు అధికారులంటున్నారు. వైద్యులు ఆయనకు నిన్న లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించి, స్వామిజీ లైంగిక దాడి చేసేందుకు అవసరమైన సత్తా కలిగి ఉన్నారని తేల్చారు.
జోధ్ పూర్ ఆశ్రమంలో చదువుకుంటున్న ఓ పదహారేళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆశారాం బాపుపై ఆరోపణలు రాగా, ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ విధించింది.